లక్నో: ఉత్తరప్రదేశ్లోని బదౌత్ పట్టణంలో మంగళవారం జరిగిన లడ్డూ మహోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. వెదురుతో నిర్మించిన వేదిక కూలడంతో ఏడుగురు చనిపోగా, 75 మంది గాయపడ్డారు. పట్టణంలోని దిగంబర్ జైన్ కళాశాల మైదానంలో ఉదయం భగవాన్ ఆదినాథ్కు అభిషేకం కోసం జైనులు లడ్డూ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక పైకి ఎక్కే మెట్లు విరగడంతో మొత్తం వేదిక కుప్పకూలింది. దీంతో వేదిక మీద ఉన్న వారంతా కింద పడ్డారు. అంబులెన్స్ సకాలంలో ఘటనా స్థలికి చేరుకోలేకపోవడంతో ఆటో రిక్షాల్లో క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.