Google Maps | లక్నో, డిసెంబర్ 3: గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలో మరో కారు ప్రమాదానికి గురైంది. బరేలి-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు.. దారి తప్పి నది కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. మంగళవారం బర్కాపూర్ గ్రామం కూడలికి సమీపంలో కాలాపూర్ కాలువ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరియా నుంచి సెడాన్ కారులో బయల్దేరిన దివ్యాంషు సింఘ్, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ టీమ్ ఘటనాస్థలానికి చేరుకొని కారును క్రేన్ సహాయంతో కాలువ నుంచి బయటకు తీసుకొచ్చారు. కాలువ నీటికి అక్కడి రోడ్డు కోతకు గురైన సంగతి గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌లో అప్డేట్ కాకపోవటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
‘మేం ప్రయాణిస్తున్న కారు బరేలీ బడా బైపాస్కు చేరుకున్నాక, గూగుల్ మ్యాప్స్ పిలిభిత్‌కు వెళ్లే రెండు దారులను చూపింది. ఇందులో ఓ గ్రామం నుంచి షార్ట్‌కట్ దారి ఉందని భావించాం. 5 కిలోమీటర్లు వెళ్లాక.. రోడ్డు తెగిపోయి ఉంది. కారు కాలువలోకి దూసుకెళ్లింది’ అని బాధితులు వివరించారు. జీపీఎస్‌ను అనుసరిస్తూ కారు ప్రమాదానికి గురవ్వటం బరేలీ జిల్లాలో ఇది రెండో ఘటన. పది రోజుల (నవంబర్ 24న) క్రితం మైన్పూర్కు చెందిన ఓ కారు రామ్‌గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వెళ్లి.. అక్కడ్నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వంతెన మార్గానికి సంబంధించిన సమాచారం గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ అప్డేట్ కాకపోవటమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.