లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేగఢ్ శివారులో ఇద్దరు దళిత బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. 15 ఏండ్లు, 18 ఏండ్లు వయసుగల వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి మాట్లాడుతూ, ఇద్దరు బాలికల మృతదేహాలను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మృతులిద్దరూ స్నేహితులని, వీరు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పారు. రెండు దుపట్టాలను కట్టి, వాటికి వేలాడుతూ వీరి మృతదేహాలు కనిపించాయన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. మొబైల్ ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మహిళల భద్రతను రాజకీయాలకు అతీతంగా చూడవలసిన సమయం ఆసన్నమైందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ మహిళలకు శ్మశాన వాటికగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది.