గాంధీనగర్: ఒక యువకుడు ఇంటర్ మధ్యలోనే చదువు మానేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), టెలిగ్రామ్ ఉపయోగించి నకిలీ బ్యాంకింగ్ యాప్‌లు క్రియేట్ చేశాడు. వాటిని సైబర్ నేరగాళ్లకు అమ్మి సైబర్ మోసాలను ప్రోత్సహిస్తున్నాడు. (Fake Banking Apps) ఒక సైబర్ మోసం కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి వాట్సాప్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను పోలిన ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. బ్యాంక్‌కు సంబంధించిన యాప్‌గా నమ్మిన ఆ వ్యక్తి దానిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాడు. ఆ వెంటనే అతడి మొబైల్ ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆ వ్యక్తికి చెందిన ఒక బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.
కాగా, బాధిత వ్యక్తి ఫిర్యాదుపై సూరత్ సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఉత్తరప్రవేశ్లోని కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల రోహిత్ వీరేంద్ర సింగ్ షాక్య కీలక సూత్రధారిగా గుర్తించారు. జూలై 20న కాన్పూర్‌లోని హోటల్‌పై రైడ్ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ యువకుడి వద్ద ఉన్న ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడైన రోహిత్‌ను ప్రశ్నించిన పోలీసులు అతడు చెప్పిన వివరాలు తెలుసుకుని షాకయ్యారు. ఆ యువకుడు 11 తరగతి మధ్యలోనే చదువు మానేశాడు. ఏఐ, టెలిగ్రామ్‌ను ఉపయోగించి నకిలీ బ్యాంకింగ్ అప్లికేషన్లు, మాల్వేర్ ఏపీకే ఫైల్స్‌ను సృష్టిస్తున్నాడు. సైబర్ నేరగాళ్లకు వాటిని అమ్ముతున్నాడు.
అయితే నిందితుడు రెండు రకాల అప్లికేషన్లు అభివృద్ధి చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. మొదటి అప్లికేషన్ బాధితుడి పరికరంలో ఇన్స్టాల్ చేసి మోసం చేయడానికి, రెండవది అడ్మిన్ అప్లికేషన్. అడ్మిన్ యాప్ ద్వారా బాధితుల మొబైల్ ఫోన్లోని ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని రియల్ టైమ్‌లో సైబర్ నేరగాళ్లు చూసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
కాగా, సైబర్ మోసగాళ్ల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, ప్రధాన కంపెనీల అప్లికేషన్లను పోలిన నకిలీ అప్లికేషన్లను ఆ యువకుడు సృష్టించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పీఎన్బీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, యూకో బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బిగ్‌బాస్కెట్, ఆర్టీవో చలాన్ సేవలకు సంబంధించిన నకిలీ అప్లికేషన్లు, చెల్లింపు లింకుల మోసపూరిత వెర్షన్లు అతడు సృష్టించిన వాటిలో ఉన్నట్లు చెప్పారు. వీటిని సైబర్ క్రైమ్ సిండికేట్లకు అతడు సరఫరా చేసినట్లు వివరించారు.
మరోవైపు నిందితుడైన రోహిత్ సబ్స్క్రిప్షన్ పద్ధతిలో వ్యాపారం చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సాఫ్ట్వేర్ ప్రారంభ వినియోగానికి రూ.15,000, సేవల కొనసాగింపు కోసం ప్రతి నెలా అదనంగా రూ. 15,000 వసూలు చేస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లోని జామ్తారా నుంచి పనిచేస్తున్న అనేక సైబర్ క్రైమ్ ముఠాలు, హర్యానా, రాజస్థాన్‌లోని సైబర్ నేరగాళ్లు అతడి నుంచి వైరస్ అప్లికేషన్లు కొనుగోలు చేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని పోలీస్ అధికారి వివరించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.