లక్నో: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో వారణాసికి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు అరెస్ట్ చేశారు. (Man Arrested For spying for Pak) దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ వ్యక్తులకు అతడు చేరవేసినట్లు ఆరోపించారు. నిందితుడ్ని వారణాసికి చెందిన తుఫైల్‌గా పేర్కొన్నారు.
కాగా, నిషేధిత పాక్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ నేత మౌలానా షా రిజ్వీ వీడియోలను వాట్సాప్ గ్రూపులలో అతడు షేర్ చేశాడని పోలీసులు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని, భారత్‌లో షరియా చట్టాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చే సందేశాలతో పాటు, ‘ఘజ్వా-ఎ-హింద్’ కోసం సందేశాలు పంపాడని ఏటీఎస్ అధికారులు చెప్పారు.
మరోవైపు వారణాసిలోని రాజ్‌ఘాట్, నమో ఘాట్, జ్ఞాన్వాపి, రైల్వే స్టేషన్, ఢిల్లీలోని ఎర్రకోట వంటి సున్నితమైన ప్రదేశాల ఫోటోలను పాకిస్థాన్‌లోని పరిచయస్తులకు తుఫైల్ షేర్ చేశాడని పోలీసులు ఆరోపించారు. స్థానిక వ్యక్తులు, పాక్ నెట్‌వర్క్‌ల మధ్య కమ్యూనికేషన్ కోసం వారణాసిలోని వాట్సాప్ గ్రూప్ లింక్‌లను కూడా నిందితుడు షేర్ చేసినట్లు తెలిపారు. అతడిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.