న్యూఢిల్లీ: అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలు ఆగస్టు 15 నుంచి మారనున్న కారణంగా వేలాది మంది పిల్లలు ముఖ్యంగా భారత్‌కు చెందినవారు స్వదేశాలకు తరలిపోవలసిన ముప్పును ఎదుర్కోనున్నారు. తమ తల్లిదండ్రుల గ్రీన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, హెచ్-1బీ వీసాదారుల పిల్లలు 21 సంవత్సరాలు దాటిన మరుక్షణం తమకు ఇప్పటివరకు ఉన్న రక్షిత ఇమిగ్రేషన్ హోదాను కోల్పోయే అవకాశం ఉంది. చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్(సీఎస్‌పీఏ) కింద పిల్లల వయసును లెక్కించే నిబంధనలకు సంబంధించి అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శుక్రవారం తాజా సమాచారాన్ని ప్రకటించింది. గ్రీన్ కార్డులు కోరుతూ 2025 ఆగస్టు 15 తర్వాత దాఖలయ్యే దరఖాస్తులకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.
తాజా నిబంధనల కింద సీఎస్‌పీఏ వయసును లెక్కించడానికి వీసా లభ్యత నిర్ధారణ కోసం వీసా బులెటిన్లోని ఫైనల్ యాక్షన్ డేట్స్ చార్ట్‌ని యూఎస్సీఐఎస్, విదేశాంగ శాఖ కలసి ఉపయోగించుకుంటాయి. గ్రీన్‌కార్డుల కోసం, ఇమిగ్రంట్ వీసా కోసం సమర్పించే దరఖాస్తుల కోసం సీఎస్‌పీఏ వయసును లెక్కించడం జరుగుతుంది. 2023 ఫిబ్రవరిలో బైడెన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం ప్రకారం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అర్హతను సాధించుకున్న హెచ్-1బీ వీసాదారులకు చెందిన కొందరు పిల్లలకు తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలో నివసించే రక్షణ లభిస్తుంది. గ్రీన్‌కార్డు కోసం తల్లిదండ్రులు వెయిటింగ్లో ఉండగా పిల్లల వయసు 21 దాటినప్పటికీ తాము అమెరికాలో నివసించే అర్హతను వారు కోల్పోరు. 21 ఏళ్ల లోపు అవివాహిత వ్యక్తులను పిల్లలుగా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ నిర్వచిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న హెచ్-1బీ వీసాదారుల పిల్లలు 21 ఏళ్లు దాటిన తర్వాత అమెరికాలో నివసించే చట్టపర అర్హత కోల్పోతారు.