న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : అమెరికా వెళ్లాలనుకుంటున్న సాధారణ భారతీయులకు సైతం అగ్ర దేశం మరో మెలిక పెట్టింది. వలసయేతర వీసాలలో కొత్త నిబంధనలను చేర్చింది. ఇకపై నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ప్రయత్నించే వారు తమ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను స్వదేశంలోనే షెడ్యూల్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన కారణంగా భారతీయ వ్యాపారులు, సందర్శకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడింది. వ్యాపారులు లేదా సందర్శకులకు బీ1 (వ్యాపార), బీ2 (టూరిస్ట్) వీసాలను జారీచేస్తారు. వీరు గతంలో తమ వీసా అపాయింట్మెంట్లను విదేశాల్లో బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. కొత్త నిబంధనతో ఇకపై అది సాధ్యం కాదు.
బీ1, బీ2 వీసాలను పొందాలనుకొనే భారతీయులు స్వదేశంలో అందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో విదేశాల్లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల ద్వారా పొందేవారు. వీసా కోసం ఇకపై ఎక్కడైతే దరఖాస్తు చేస్తున్నారో అక్కడి పౌరసత్వానికి సంబంధించిన ఆధారాన్ని సమర్పించాలని అమెరికా స్పష్టం చేసింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాలను వ్యాపారులు, సందర్శకులు, విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగులు, అమెరికా పౌరులను పెళ్లి చేసుకున్న వారికి జారీ చేస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబైలలో బీ1, బీ2 వీసాల ఇంటర్వ్యూలకు సుమారు మూడున్నర నెలల సమయం పడుతున్నది.