న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం సమావేశమయ్యారు. (JD Vance Meets PM Modi) ఇరు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల తర్వాత వారిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పన్నుల భారం నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాల స్థిరీకరణపై రెండు దేశాలు ప్రధానంగా దృష్టిసారించినట్లు సమాచారం.
కాగా, అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో చైనాతోపాటు పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. భారతీయ వస్తువులపై గతంలో ఉన్న 10 శాతం సుంకాలను 26 శాతానికిపైగా పెంచారు. అయితే భారత్, అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందాల ఖరారు కోసం కొత్త టారిఫ్‌ను 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన, ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.