న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారతీయ దిగుమతులపై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్‌కు మరో దేశం నుంచి కూడా పన్ను పోటు ఎదురైంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై 50 శాతం సుంకాలు విధించేందుకు మెక్సికో సెనేట్ బుధవారం ఆమోదించింది. భారత్‌తోపాటు చైనా, మరికొన్ని ఆసియన్ దేశాలపై కూడా దీని ప్రభావం ఉండనున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సంతుష్టి పరిచేందుకే మెక్సికో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ అభిప్రాయపడింది. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సుంకాల పెంపు నిర్ణయంతో ఆటోలు, ఆటో విడిభాగాలు, జౌళి, ప్లాస్టిక్స్, ఉక్కు వంటి వస్తువులపై 50 శాతం దిగుమతి సుంకం పడనున్నది. మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని దేశాలపై దిగుమతి సుంకాన్ని 50 శాతం విధించాలని మెక్సికో సెనేట్ తీర్మానించింది. దీని వల్ల భారత్, దక్షిణ కొరియా, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా నష్టపోనున్నాయి.
వచ్చే ఏడాది అదనంగా రూ. 376 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 33,940 కోట్లు) అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని మెక్సికో భావిస్తోంది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా నీన్బామ్ నిర్ణయించుకున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అమెరికా-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందంపై అమెరికాలో సమీక్ష జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకే మెక్సికో ఈ చర్యను చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెక్సికో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ప్రస్తుతం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనీస్ వస్తువులపై మెక్సికో భారీగా సుంకాలు విధించింది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం షేన్‌బామ్ ప్రభుత్వంపై గత కొన్ని నెలలుగా తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. మెక్సికన్ స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ పియోయిడ్ ఫెంటానిల్(మత్తు పదార్థం) ప్రవాహాన్ని అడ్డుకోవడంలో విఫలమైనందుకు అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తామని మెక్సికోను బెదిరించారు. అంతేగాక అమెరికన్ రైతులకు సాగునీరును అందించే 1944 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు మెక్సికోపై మరో 5 శాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
భారత్‌పై మెక్సికో ప్రభావం
భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించాలన్న మెక్సికో నిర్ణయం ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. 2024లో భారతీయ దిగుమతులు అత్యధికంగా 1,170 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. మెక్సికన్ ఎగుమతులకు భారత్ 9వ గమ్యస్థానంగా ఉంది. ప్రస్తుతం మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల కన్నా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులే అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు 2024లో మెక్సికోకు భారతీయ ఎగుమతుల విలువ 890 కోట్ల డాలర్లు ఉండగా దిగుమతుల విలువ 280 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. భారత్‌కు అనుకూలంగా వాణిజ్య వ్యత్యాసం ఉంది. 2024లో భారత్ నుంచి ప్రధానంగా మోటారు కార్లు, ఆటో విడిభాగాలు, ఇతర ప్యాసింజర్ వాహనాలను మెక్సికో దిగుమతి చేసుకుంది. ఈ వస్తువులపై మెక్సికో ఇప్పుడు భారీగా సుంకాలు విధించడంతో వచ్చే ఏడాది ఈ వస్తువుల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.