Visa Appointments | భారత్ (India)లోని అమెరికా దౌత్య కార్యాలయం (US Embassy) భారతీయులకు షాకిచ్చింది. తాజాగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. అపాయింట్మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ కారణంగా ఏకంగా 2 వేల యూఎస్ వీసీ దరఖాస్తులను రద్దు చేసినట్లు ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండటంతో వీటిని రద్దు చేసినట్లు తెలిపింది. ఈ అపాయింట్మెంట్లు అన్నీ ‘బాట్స్’ (Bots) ద్వారా వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొంది.
‘బాట్స్ చేసిన 2 వేల వీసా అపాయింట్మెంట్లను భారత్‌లోని కాన్సులర్ టీం రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్లను ఏమాత్రం సహించేది లేదు. ఈ అపాయింట్మెంట్లను రద్దు చేయడంతో పాటు.. ఆయా సంబంధిత ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా సస్పెండ్ చేస్తున్నాం’ అని దౌత్య కార్యాలయం తన ఎక్స్ పోస్టులో పేర్కొంది.
అమెరికాకు వ్యాపార, పర్యాటక, బీ1, బీ2, విద్యార్థి వీసాలకు అపాయింట్మెంట్ల కోసం సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సిన వస్తుందన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా వీసా అప్లై చేసుకుంటే ఏండ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఏజెంట్లను డబ్బు చెల్లిస్తే కేవలం నెల రోజుల్లోనే అపాయింట్మెంట్లు దొరుకుతాయి. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే. ఏజెంట్లు కొన్నిరకాల ప్రత్యేకమైన బాట్స్‌ను ఉపయోగించి అపాయింట్మెంట్ స్లాట్లను బ్లాక్ చేస్తుంటారు. దీంతో వ్యక్తిగతంగా వీసాలకు అపాయింట్మెంట్లు చేసుకున్న వారు కూడా సుదీర్ఘ కాలం వేచి ఉండలేక ఏజెంట్లకు డబ్బులు చెల్లించి ఈ తరహాలో అపాయింట్మెంట్లు పొందుతుంటారు. దీని కోసం ఒక్కో వీసా దరఖాస్తుకి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ ఏజెంట్లు వసూలు చేస్తుంటారు.
కాగా, 2023-24 (అక్టోబర్ 2023 – సెప్టెంబర్ 2024) ఆర్థిక సంవత్సరంలో US F-1 విద్యార్థి వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. వాటిలో 2.79 లక్షలు (41 శాతం) తిరస్కరించబడ్డాయి. గతేడాది 6.99 లక్షల దరఖాస్తులు రాగా 36 శాతం తిరస్కరణకు గురయ్యాయి. ఇక 2014లో వీసాల తిరస్కరణ రేటు 15 శాతంగా ఉండేది. ఇప్పుడు అది దాదాపు మూడు రెట్టు పెరిగింది. ఈ కారణంగా యూఎస్ యూనివర్సిటీల్లో చదువాలనుకునే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది.
Also Read..
Vladimir Putin | త్వరలో భారత పర్యటనకు పుతిన్.. వెల్లడించిన క్రెమ్లిన్
Infosys | మైసూర్ క్యాంపస్ నుంచి మరికొంతమంది ట్రైనీల తొలగింపు.. వారికి ఓ ఆఫర్ ఇచ్చిన సంస్థ
America | యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థినికి బేడీలు వేసి తీసుకెళ్లిన అధికారులు.. వీడియో వైరల్