Donald Trump | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 250 మంది భారతీయులతో కూడిన విమానం టెక్సాస్ నుంచి అమృత్‌సర్‌కు బయలుదేరింది. రాబోయే రోజుల్లో మరింత మందిని భారత్‌కు పంపించే అవకాశం ఉన్నది. వచ్చే వారం అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అమెరికాలో మొత్తం 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా, అందులో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత భారతీయులే అధికం. ఇప్పటికే ఆ దేశ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు 18 వేల మంది భారతీయుల లిస్టును తయారు చేసినట్టు బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది. సుమారు 20,407 మంది భారతీయులకు సరైన పత్రాలు లేవని, వారిలో 17,940 మందిని పంపించి వేయడానికి జాబితా సిద్ధంగా ఉందని వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 2,467 మంది అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం శిక్ష అనుభవిస్తూ అక్కడి నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు.
మోదీ ప్రపంచంలోనే శక్తిమంతమైన ప్రధాని అని, ఆయనే తమను రక్షిస్తారని పలువురు భారతీయ వలసదారులు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. అమెరికా డిపోర్టేషన్‌కు ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నారన్న విషయం ట్రంప్ చర్యల ద్వారా వెల్లడవుతున్నది. ఏది సరైనదో అది భారత్ చేస్తుందని ఇటీవల ప్రధాని మోదీతో సంభాషణ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అక్రమ వలసలతో వ్యవస్థీకృత నేరాలకు సంబంధం ఉన్నందున తాము సైతం వాటిని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. వారి భారతీయతను ధ్రువీకరించే పత్రాలను తమతో పంచుకుంటే వారిని వెనక్కి తీసుకుంటామని ఆయన యూఎస్‌కు చెప్పారు. ఏ దేశమైనా చట్టబద్ధ పౌరులను మాత్రమే తమ దేశంలో ఉండటానికి అనుమతిస్తుందని, దానికి అమెరికా మినహాయింపు కాదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.
తాము వెనక్కి పంపించే వలసదారులను ఆయా దేశాలు అంగీకరించాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. వారిని తిరస్కరించే దేశాలపై ఆంక్షలు తప్పవని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్జాన్సన్ హెచ్చరించారు. అమెరికా కాంగ్రెస్ కూడా ఈ ఆంక్షలు విధించడానికి సమ్మతి తెలిపిందన్నారు. కాగా, ఇటీవల అమెరికా పంపిన అక్రమ వలసదారులను తీసుకోవడానికి తిరస్కరిస్తూ వారితో వస్తున్న మిలటరీ విమానం ల్యాండింగ్‌కు కొలంబియా దేశం తిరస్కరించింది. దీంతో కొలంబియా నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించారు. దీనికి భయపడ్డ ఆ దేశం వెంటనే తన విమానాలను అమెరికాకు పంపి ఆ దేశంలో ఉన్న అక్రమ వలసదారులకు వెనక్కి తీసుకురావడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఆగింది.