న్యూఢిల్లీ: హాలీవుడ్ సినిమా ఓపెన్‌హైమర్ (Oppenheimer) లో ఓ సందర్భంలో హీరో చెప్పే డైలాగులు వివాదాస్పదంగా మారాయి. శృంగార సన్నివేశంలో హీరో భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని చదవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలోంచి ఆ సన్నివేశాన్ని తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
శృంగార సన్నివేశంలో హీరో చేత భగవద్గీత పఠింపజేయడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఆ సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించకపోవడంపై ఆయన మండిపడ్డారు. అలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్న సినిమాకు సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికెట్ ఇచ్చిందని ప్రశ్నించారు. తక్షణమే ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. బోర్డులోని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆటమ్ బాంబు కనుగొన్న శాస్త్రవేత్త జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మేటి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఆ చిత్రాన్ని తీశారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ రికార్డులు బద్దలుకొడుతోంది. నటుడు సిలియన్ మర్ఫీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. అయితే హీరోయిన్‌తో ఉన్న శృంగార సన్నివేశంలో హీరో భగవద్గీత శ్లోకం చెప్పడం వివాదాస్పదమైంది. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా బాయ్‌కాట్ ఓపెన్‌హైమర్, రెస్పెక్ట్ హిందూకల్చర్ అన్న హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఓపెన్‌హైమర్‌ను సినిమాను బ్యాన్ చేయాలని ట్విట్టర్లో నెటిజన్లు మండిపడుతున్నారు. హిందూ మతాన్ని హాలీవుడ్ తప్పుగా చిత్రీకరించిందని విమర్శిస్తున్నారు. ఎంతో ఆధ్మాత్మిక విలువ ఉన్న ఆ శ్లోకాల్ని ఆ సీన్లో వాడటం సరికాదంటున్నారు. హిందూ మత విశ్వాసాలను నీరుగార్చే రీతిలో ఆ సన్నివేశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అటామిక్ బాంబు పితామహుడు జే రాబర్ట్ ఓపెన్హైమర్కు, భగవద్గీతకు ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయాన్ని చెప్పేందుకు ఆ సీన్ తీసినట్లు నిర్మాతలు చెబుతున్నారు. ఓపెన్‌హైమర్ సంస్కృత భాషను నేర్చుకుని, గీతా శ్లోకాలను పఠించినట్లు తెలుస్తోంది.