UPI | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నెల రోజుల్లో నాలుగోసారి ఈ పరిస్థితి ఎదురవడంతో నగదు లావాదేవీలే నయమని, టెక్నాలజీని నమ్ముకుని ఆటోలు, హోటళ్ల వద్ద అవమానాలపాలవుతున్నామని సామాన్యులు సామాజిక మాధ్యమాల్లో వాపోయారు. డౌన్‌డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం, శనివారం ఉదయం 11.26 గంటల నుంచి యూపీఐ చెల్లింపులకు అంతరాయం ఏర్పడింది.
ఉదయం 11.40 గంటలకు ఈ సమస్య మరింత తీవ్రమైంది. తమ డిజిటల్ చెల్లింపులు విఫలమైనట్లు డౌన్ డిటెక్టర్‌కు 222 ఫిర్యాదులు వచ్చాయి. యూపీఐ మౌలిక సదుపాయాలను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దీనిపై స్పందిస్తూ, ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో శనివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్‌లోని యూజర్లు యాప్‌ను ఉపయోగించటంలో అవాంతరాలు ఎదుర్కొన్నారు. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్లు అప్లోడ్ కావటం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం 18 శాతం మంది మెసేజ్‌లు పంపటంలో ఇబ్బంది ఎదుర్కొన్నారని తెలిసింది.