Suvendu Adhikari PA : పశ్చిమబెంగాల్ సీఎం (West Bengal CM) సువేందు అధికారి (Suvendu Adhikari) పీఏ చంద్రనాథ్ రథ్ (Chandranath Rath) హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ (Uttarpradesh), బీహార్ (Bihar) పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి విశాల్ శ్రీవాస్తవ (Vishal Srivastava), రాజ్ సింగ్ (Raj Singh), మయాంక్ మిశ్రా (Mayank Mishra) లను అదుపులోకి తీసుకున్నారు. కోల్కతా సమీపంలోని ‘బ్యాలీ’ టోల్ ప్లాజా వద్ద నిందితులు చేసిన యూపీఐ పేమెంట్.. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించింది.
గత బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చంద్రనాథ్ రథ్ తన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండగా ఈ హత్య జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా స్కార్పియో వాహనం ముందు ప్యాసింజర్ సీటులో కూర్చుని ఉండగా దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మొదట సిల్వర్ రంగు నిస్సాన్ మైక్రా కారుతో రథ్ ఎస్యూవీని అడ్డగించారు. ఆ వెంటనే బైక్పై వచ్చిన హంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. అనంతరం ఆ కారును అక్కడే వదిలేసి మరో ఎరుపు రంగు కారు, బైక్పై పరారయ్యారు.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితులు వాడిన మైక్రా కారును గుర్తించారు. ఆ కారు కోసం ఓ టోల్ ప్లాజా వద్ద యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించినట్లు తేలింది. ఆ చెల్లింపు ఆధారంగా నిందితుల వివరాలు సేకరించిన పోలీసులు.. వారిని బీహార్, ఉత్తర ప్రదేశ్లలో అరెస్ట్ చేశారు. పట్టుబడిన ముగ్గురూ వృత్తిపరమైన హంతకులని, వీరిలో విశాల్ శ్రీవాస్తవపై హత్య, దోపిడీ సహా 15కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను సోమవారం బారాసాత్ కోర్టులో హాజరుపరచనున్నారు.