లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రసిద్ధ దొంగ కార్ల మార్కెట్‌ను పోలీసులు మూసివేయించారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు, దేశ వ్యాప్తంగా దొంగిలించిన కార్లను మీరట్‌లోని సోటిగంజ్ మార్కెట్‌కు తరలిస్తారు. ఇక్కడ చోరీ కార్లను భాగాలను విడదీసి అమ్ముతుంటారు. 1990లో వెలుగులోకి వచ్చిన ఈ సోటిగంజ్ ఆటోమొబైల్ స్క్రాప్ మార్కెట్ నాటి నుంచి బాగా విస్తరించింది. ప్రస్తుతం ఇక్కడ 300కుపైగా దీనికి సంబంధించిన షాపులున్నాయి. సుమారు వెయ్యి మందికిపైగా ఈ షాపుల్లో పనిచేస్తున్నారు.
కాగా, దొంగ కార్ల అక్రమ వ్యాపారంలో కీలకమైన హాజీ ఇక్బాల్, హాజీ గల్లాను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వారి ఆస్తులను కూడా అటాచ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోటిగంజ్ ఆటోమొబైల్ మార్కెట్లోని షాపులను మూసివేయాలని ఆ ప్రాంత పోలీస్ అధికారి ఆదివారం ఆదేశించారు. తదుపరి ఆదేశాల వరకు వాటిని తెరువద్దని చెప్పారు. షాపుల్లోని ఆటోమొబైల్ వాటికి సంబంధించిన బిల్లులను చూపాలన్నారు. మరోవైపు షాపుల మూసివేతపై స్థానిక వ్యాపారులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది అక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
కాగా, షాపుల మూసివేతపై వ్యాపారుల సంఘం మండిపడింది. చాలా మంది సక్రమంగానే వ్యాపారం చేస్తున్నారని, జీఎస్టీ కూడా కలిగి ఉన్నారని తెలిపింది. కొందరు మాత్రమే అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపైనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక్కడి షాపులన్నీ మూసివేస్తే పని కోల్పోయిన వారు నేర బాట పట్టే అవకాశమున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులతో మాట్లాడతామని వ్యాపారుల సంఘం తెలిపింది.