UP shocker | ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని హతిగావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దలు అనాగరికంగా వ్యవహరించారు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన వివాహితను చెట్టుకు కట్టేశారు. ఆమె మెడలో చెప్పుల దండ వేశారు.
ముఖానికి పూర్తిగా నలుపు రంగు సిరా పూశారు. జట్టు కత్తిరించారు. మైనర్లు అయిన తన ముగ్గురు పిల్లల కళ్ల ముంగిటే ఈ తతంగం అంతా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలి భర్త బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లాడు. మహిళ స్వగ్రామంలోనే ఉండి పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై గ్రామంలో ఆగ్రహం పెల్లుబికింది.
దాంతో విషయం గ్రామంలోని పంచాయతీ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పంచాయతీ పెద్దలు ముంబైలో ఉన్న బాధితురాలి భర్తకు విషయం చెప్పారు. వెంటనే పంచాయతీకి రావాలని పిలిపించారు. భర్త, ముగ్గురు పిల్లల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. భర్త వివాహేతర సంబంధం నిజమేనని రుజువు చేశారు. ఆపై ఆమెను చెట్టుకు కట్టేసి మెడలో చెప్పుల దండ వేయాలని, ముఖానికి నల్లరంగు పూయాలని, జుత్తు కత్తిరించాలని తీర్పు చెప్పారు.
పంచాయతీ పెద్దల తీర్పు మేరకు గ్రామస్తులలో కొందరు బాధితురాలి ముగ్గురు పిల్లల ముందే ఆమెను చెట్టుకు కట్టేశారు. మెడలో చెప్పుల దండ వేశారు. ముఖానికి నల్లరంగు పూసి, జుత్తు కత్తించారు. కన్న పిల్లలు, కట్టుకున్న భర్త ముందు ఆమె ఘోరంగా అవమానించారు. ఈ తతంగాన్నంతా గ్రామస్తుల్లో ఒకరు వీడియో తీశారు. ఈ వీడియోను దళిత్ వాయిస్ అనే పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A Panchayat in Pratapgarh, Uttar Pradesh, tied a woman to a tree, beat her, shaved her head, smeared her face with black ink and publicly humiliated her by making her wear a garland of shoes in front of her three minor children on suspicion of having an illicit relationship… pic.twitter.com/faLi27VCL7
— The Dalit Voice (@ambedkariteIND) July 29, 2024
దాంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిపై దుశ్చర్యకు పాల్పడిన గ్రామ పెద్దలు సహా 15 మంది గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.