లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసిన కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను గురువారం సంఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ నెల ౩న జరిగిన నేర దృశ్యాన్ని నిందితుడు ఆశిష్ మిశ్రా, సహ నిందితుడు అంకిత్ దాస్‌తో కలిసి పునర్నిర్మించనున్నారు. దీని కోసం పోలీస్ వాహనాలను వినియోగిస్తున్నారు.
ఈ నెల 3న లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు పక్కన నిరసన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా వాహనం దూసుకెళ్లింది. రైతులను వాహనంతో తొక్కించిన ఘటనతోపాటు అనంతరం జరిగిన అల్లర్లలో మొత్తం 8 మంది మరణించారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నది. దీంతో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు పోలీసులు రెండు సార్లు సమన్లు జారీ చేశారు. గత శనివారం తన న్యాయవాదితో కలిసి లఖింపూర్ ఖేరీ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఆశిష్ మిశ్రాను పలు గంటలు ప్రశ్నించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. కాగా, కోర్టు అనుమతించిన మూడు రోజుల పోలీస్ రిమాండ్ గురువారంతో ముగియనున్నది.
#WATCH Special Investigation Team (SIT) in Lakhimpur Kheri to recreate the crime scene pic.twitter.com/T6ffwrN2z4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 14, 2021