Reels | లక్నో, సెప్టెంబర్ 16: యూపీ పోలీసులు నడిరోడ్డుపై పడి ఉన్న ఒక శవాన్ని అరెస్ట్ చేశారు. శవమంటే నిజంగా శవం కాదు. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి కస్గంజ్ జిల్లాలో నడిరోడ్డుపై శవంలా పడుకున్న ముకేశ్ కుమార్, స్నేహితులైన కొందరు యువకులను అరెస్ట్ చేశారు. ఇతడు ఎర్రటి చాపపై పడుకుని ఉండగా, మెడలో దండ వేసి ఒంటిపై తెల్లటి గుడ్డ కప్పారు. అతని ముక్కులో దూది కూడా పెట్టి అతడిని అచ్చం శవంలా నడిరోడ్డుపై ఉంచిన అతని స్నేహితులు ఇన్స్టాలో రీల్ కోసం దానిని వీడియో తీయడం ప్రారంభించారు.
దీంతో పెద్దయెత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ముకేశ్ కుమార్, స్నేహితులను అరెస్ట్ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమంలో పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యూలు, లైక్ల కోసం వీరు ఏమన్నా చేస్తారు అని ఒకరు, ఇలాంటి చర్యల ద్వారా వీరు సమాజానికి చాలా చెడు సందేశాన్ని ఇస్తున్నారు, ప్రపంచమంతా ఇలాంటి వింత, పిచ్చి మనుషులతో నిండిపోతున్నది అని మరికొందరు కామెంట్లు చేశారు.