లక్నో: బీజేపీ మంత్రి ఒకరు సొంత పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై మాట్లాడుతున్న ఆయన తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మైక్‌ను విసిరేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్, శనివారం మౌలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగాన్ని బీజేపీ కార్యకర్తలు పట్టించుకోకుండా ఒకరితో మరొకరు మాట్లాడుకుంటున్నారు. దీనిని గమనించిన మంత్రి సంజయ్ నిషాద్ సహనం కోల్పోయారు. ‘నువ్వు నా కంటే పెద్ద రాజకీయ నాయకుడివైతే మాట్లాడు, లేకపోతే విను’ అంటూ ఆగ్రహంతో మైక్‌ను విసిరేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు, నేతలు షాక్ అయ్యారు. ఆయనకు నచ్చజెప్పి మాట్లాడటం కొనసాగించాలని కోరారు.
తిరిగి మాట్లాడిన మంత్రి సంజయ్ నిషాద్, పార్టీ కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు ఇతరుల అడుగుజాడలను అనుసరిస్తున్నారని విమర్శించారు. ‘మీరు నాశనం అవుతారు. మీకు ఏమి కావాలి? మీ పతనమా?’ అంటూ ఒక కార్యకర్తను ఉద్దేశించి అన్నారు. తాను ప్రసంగిస్తున్నప్పుడు వినకుండా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
కాగా, ఒకవైపు ఉత్తరప్రదేశ్‌ను వరదలు ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందిపడుతుండగా, మరోవైపు వరద ప్రభావిత జిల్లాలో పార్టీ సమావేశాన్ని బీజేపీ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే మంత్రి సంజయ్ నిషాద్ ఆగ్రహంతో మైక్‌ను విసిరేసిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP : मंत्री संजय निषाद को आया कार्यकर्ताओं पर गुस्सा माइक फेके
जिसका वीडियो वायरल हो रहा… pic.twitter.com/9yhCpqrKNn— Priti Yadav (@Pritiyadavvns) October 15, 2022