Uttar Pradesh | మీరట్: సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వాసులు లైవ్‌లోనే తిలకించారు. మెడలో నోట్ల దండతో ఓ పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్తుండగా అటుగా వెళ్తున్న ట్రక్ డ్రైవర్ నోట్ల దండలోని కొన్ని నోట్లు లాక్కుని పరారయ్యాడు. అప్రమత్తమైన వరుడు.. తాను పెళ్లి మండపానికి వెళ్లాలన్న విషయాన్ని పక్కనపెట్టి గుర్రం దిగి బైక్‌పై ట్రక్‌ను వెంబడించాడు.
దానిని సమీపించగానే సినిమాలో చూపించినట్టుగానే బైక్‌ను వదిలి వేగంగా వెళ్తున్న ట్రక్‌ను పట్టుకుని అతికష్టం మీద ముందుకు కదులుతూ విండో గుండా లోపలికి ప్రవేశించాడు. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. అతడు దొంగిలించిన నోట్లను తిరిగి సొంతం చేసుకున్నాడు. ఈలోగా డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా ఓ బైకర్ తన బైక్‌ను అడ్డుగా పెట్టి పట్టుకున్నాడు. అనంతరం అతడికి దేహశుద్ధి చేశారు. పిడిగుద్దులు కురిపించారు. ఆ తర్వాత వారికి మరికొందరు జత కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.