Uttar Pradesh | 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఆ మాటలు విన్న అన్నదాతలు.. సీఎంకు తమపై ఎంత ప్రేమ ఉన్నదోనంటూ మురిసిపోయారు. గంపగుత్తగా బీజేపీకి ఓట్లేసి గెలిపించారు.
అధికారంలోకి వచ్చిన యోగీ సర్కారు మాటతప్పింది. ఉచిత విద్యుత్తు ఉత్తిదేనంటూ బోరుబావులకు విద్యుత్తు మీటర్లు బిగించడం ప్రారంభించింది. ఈ నయవంచనను భరించని అన్నదాతలు పలుమార్లు మీటర్ల బిగింపును అడ్డుకొన్నారు. అయినా సర్కారు వైఖరి మార్చుకోలేదు. దీంతో కడుపుమండిన రైతన్న సర్కారుపై పోరాటానికి సిద్ధమయ్యాడు.
Up
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మాటతప్పింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఆ హామీని నెరవేర్చలేదు. పైగా బోరు బావులకు విద్యుత్తు మీటర్లు బిగిస్తున్నది. యోగీ సర్కారు ఏకపక్ష చర్యలపై అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు మీటర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా కిసాన్ సభ, భారతీయ కిసాన్ యూనియన్ ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. రైల్వే ట్రాకులను దిగ్బంధించి, రైల్‌రోకో నిర్వహిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
మోసం జరిగింది ఇలా..
యూపీలో తొలి దఫా బీజేపీ సర్కారు విధానాలపై రైతన్నలు గుర్రుగా ఉన్నట్టు నివేదికలు తేల్చాయి. దీంతో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో.. ఎన్నికలకు సరిగ్గా నెల ముందు గొట్టపు బావుల విద్యుత్తు బిల్లులను 50 శాతం తగ్గిస్తూ యోగి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గొట్టపు బావులకు ఉచిత విద్యుత్తు ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మాటలు నమ్మిన అన్నదాతలు మళ్లీ యోగి సర్కారుకే ఓటేశారు. అయితే, ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు.
అధికారులతో వాగ్వివాదం
బిజ్నోర్‌లో ఇటీవల అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. మీటర్లు బిగిస్తే బిల్లు తడిసి మోపెడవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హార్స్‌పవర్‌కు హర్యానాలో రూ.35 వసూలు చేస్తుండగా ఇక్కడ రూ.185 చొప్పున బిల్లు చెల్లిస్తున్నామని రైతు నాయకుడు సుఖ్దీప్ తోమర్ పేర్కొన్నారు.
ఏడాదిగా నిరసనలే
యూపీవ్యాప్తంగా దాదాపు 14 లక్షల బోరు బావులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి అన్ని బోరుబావులకు మీటర్ల బిగింపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మీటర్ల బిగింపు సందర్భంగా రైతులు యూపీపీసీఎల్ అధికారులను నిర్బంధించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. గత జూన్‌లో వందలాది మంది రైతులు మీరట్‌లోని పశ్చిమాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (పీవీవీఎన్‌ఎల్) ప్రధాన కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.