న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరినీ చంపేస్తుందంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సుత్తితో బాది దారుణంగా హత్య చేశాడు. కాన్పూర్‌కు చెందిన సుశీల్ కుమార్ ఆ పట్టణ దవాఖానలోని ఫోరెన్సిక్ విభాగం హెడ్‌గా ఉన్నాడు. శుక్రవారం తన భార్య(48), కుమారుడు(18), కుమార్తె(15)ను హత్య చేశాడు. తర్వాత తన సోదరుడికి ఫోన్ చేసి.. పోలీసులకు చెప్పమన్నాడు. పోలీసులు వచ్చే సరికి పారిపోయాడు. అక్కడ ఉన్న డైరీలో చూడగా ‘కరోనా అందరినీ చంపేస్తుంది’ అని ఉన్నది. సుశీల్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. తాను నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నానని కూడా సుశీల్ డైరీలో పేర్కొన్నాడు. తను చనిపోతే భార్య పిల్లలు కష్టాల పాలవుతారని అందుకే చంపేస్తున్నాని కూడా పేర్కొన్నాడు. సుశీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.