లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్కు బుధవారం మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్ ఎస్పీని వీడారు. హర్దోయ్ సదర్ ఎమ్మెల్యే అయిన ఆయన శాసన సభ్యత్వంతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను అఖిలేశ్ యాదవ్కు పంపినట్లు మీడియాతో అన్నారు. బీజేపీ మద్దతుతో డిప్యూటీ స్పీకర్ అయిన నితిన్ అగర్వాల్ ఆ పార్టీలో చేరవచ్చని తెలుస్తున్నది. బీజేపీ జన్ విశ్వాస్ ర్యాలీ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి వేదికను ఆయన పంచుకున్నారు.
కాగా, పలువురు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల చేరికతో మంచి జోష్లో ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్కు బుధవారం షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు. తర్వాత అఖిలేశ్ మామ, మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ గుప్తా కూడా బీజేపీలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ రెండు షాకుల నుంచి అఖిలేశ్ కోలుకోకముందే ఆ పార్టీకి చెందిన నితిన్ అగర్వాల్, తన శాసన సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు.