న్యూఢిల్లీ: స్నేహితులతో కలిసి షేరింగ్ అద్దె ఇంట్లో ఉంటున్న ఎంబీబీఎస్ విద్యార్థికి ఇంటి యజమానురాలి నుంచి అసాధారణ అభ్యర్థన వచ్చింది. (andlady unusual request to Student) తన కుమార్తెను ఆ ప్లాట్లోని ఒక గదిలో ఉంచాలని, నీట్ పరీక్ష ప్రిపరేషన్‌కు సహకరించాలని ఆమె కోరింది. దీంతో ఏం చేయాలో తోచని అతడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సలహాలు ఇచ్చి సహకరించాలని అందులో కోరాడు. సచిన్ ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుతున్నాడు. మరో ఇద్దరితో కలిసి ఢిల్లీలో మూడు బెడ్ రూమ్‌లున్న అద్దె ప్లాట్‌లో ఉంటున్నాడు.
కాగా, ఫ్లాట్ యజమానురాలు ఇటీవల అసాధారణ అభ్యర్థన చేసింది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న తన కుమార్తె ఆ ఫ్లాట్‌లోని ఒక రూమ్‌లో ఉంటుందని చెప్పింది. అలాగే సచిన్ చదువుతున్న కాలేజీలో అడ్మిషన్ పొందేందుకు, ఆమె ప్రిపరేషన్‌కు సహకరించాలని మెసేజ్ ద్వారా కోరింది. ఇంటి యజయానురాలు చేసిన ఈ అభ్యర్థనపై సచిన్ షాక్ అయ్యాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తన సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నేనేం చేయాలి? ఇంటి అద్దె తగ్గించమని ఆమెను అడగాలా?’ అని ప్రశ్నించాడు.
మరోవైపు సచిన్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. అనేక మంది పలు సలహాలు ఇచ్చారు. ఆడ, మగ కలిసి ఉంటే వచ్చే ఇబ్బందులు, తలెత్తే పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంపై చాలా మంది హెచ్చరించారు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలని, తెలివిగా తప్పించుకోవాలని, ఆ ఇంటిని ఖాళీ చేయాలని కొందరు, అద్దె తగ్గింపుపై ఇంటి యజమానురాలితో చర్చించాలని మరి కొందరు సూచించారు. తగిన నిర్ణయం తీసుకోవాలని, జాగ్రత్త వహించడం ఎంతో మంచిదని కొందరు హితవు కలిపారు. దీంతో ఎవరి సూచన ఫాలో కావాలో తెలియక సచిన్ గందరగోళంలో పడ్డాడు.