న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aaftab Poonawala)ను రోజులో కొన్ని గంటలు ఓపెన్ జైలులో ఉంచాలని తీహార్ జైలుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇతర ఖైదీలకు వర్తించే నిబంధనల మాదిరిగా రోజుకు ఎనిమిది గంటలపాటు ఏకాంత జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని పేర్కొంది. న్యాయమూర్తులు కుమార్ కైట్, గిరీష్ కత్పాలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, శ్రద్ధా వాకర్‌తో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలా 2022 మే 18న ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి పలు చోట్ల పడేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కు అఫ్తాబ్‌కు తీసుకెళ్తుండగా అతడిపై దాడి జరిగింది. దీంతో నిందితుడికి తగిన భద్రత కల్పించాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అఫ్తాబ్‌ను తీహర్ జైలులోని గదిలో ఒంటరిగా ఉంచారు.
మరోవైపు అఫ్తాబ్ పూనావాలా దీని గురించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అఫ్తాబ్‌ను అనుమతించాలని అతడి తరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. ఈ నేపథ్యంలో ఇతర ఖైదీలకు వర్తించే విధంగా అఫ్తాబ్‌ను ఎనిమిది గంటల పాటు జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. రాత్రి వేళ ఒంటరిగా ఉండే గదిలో అతడ్ని ఉంచాలని జైలు అధికారులకు సూచించింది.