న్యూఢిల్లీ : రెండు కేసుల పరిష్కారానికి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీబీఐ అధికారులను అదే సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. నేరస్థులను కటకటాల్లోకి పంపాల్సిన ప్రాథమిక బాధ్యత కలిగిన సీబీఐ ప్రతిష్ట ఈ ఆరోపణలతో దెబ్బతిందని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఏప్రిల్ 25న వెలువరించిన తన ఉత్తర్వులలో వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, తదితర ప్రభుత్వ విభాగాలలో పెచ్చరిల్లిన అవినీతికి సంబంధించి ఇది అత్యంత ప్రత్యేక కేసుగా న్యాయమూర్తి అభివర్ణించారు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడానికి సంబంధించి ఇది ప్రత్యేకమైన కేసేమీ కాదని, కాని దర్యాప్తులను నీరుగార్చడానికి లేదా ప్రభావితం చేయడానికి వివిధ శాఖల అధికారుల మధ్య భారీ కుట్ర జరుగుతున్నట్లు ఈ కేసును బట్టి తెలుస్తోందని న్యాయమూర్తి అన్నారు.