న్యూఢిల్లీ, జూలై 25: ఉపాధి హామీ పథకానికి కేంద్రం తిలోదకాలు ఇస్తున్నది. 2022-23లో 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో వెల్లడించారు. 2021-22తో పోలిస్తే ఇది 247 శాతం అధికం. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లలో కార్టుల తొలగింపు అధికంగా ఉంది.
తెలంగాణలో 2021-22లో 61,278 కార్డులు, 2022-23లో 17,32,936 కార్డులు (నిరుడుతో పోలిస్తే 2,727 శాతం ఎక్కువ) తొలగించారు. నకిలీ కార్డులు, పని చేయడం ఇష్టం లేకపోవడం, కుటుంబాలు శాశ్వతంగా వలస వెళ్లడం, వ్యక్తుల మరణాల కారణంగా జాబ్ కార్డులను తొలగించినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెబుతూ .. తమ కర్తవ్యాన్ని తప్పించుకొనే ప్రయత్నం చేశారు.