న్యూఢిల్లీ, నవంబర్ 17: కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. అస్సాంలోని సిలిగురిలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన గడ్కరీ కార్యక్రమం మధ్యలో హఠాత్తుగా జబ్బుపడ్డారు. వెంటనే ఆయనను డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా ఇంటికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు జరిపారు. సిలిగురిలోని శివమందిర్ నుంచి సేవక్స్ కంటోన్మెంట్ వరకు 13 కిలోమీటర్ల ఎత్తైన రహదారి పనులకు గడ్కరీ గురువారం శంకుస్థాపన జరిపారు.
డార్జిలింగ్ జంక్షన్ సమీపంలోని దాగాపూర్లో రోడ్డు పనులకు సంబంధించిన శంకుస్థాపన రాయి వేశారు. ‘ఈ రోజు రూ.1,206 కోట్ల వ్యయంతో కూడిన మొత్తం మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులను ప్రారంభించాను’ అని ట్విట్టర్లో ఆయన వెల్లడించారు. ఫొటోలు కూడా షేర్ చేశారు. కార్యక్రమం మధ్యలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన ఎంపీ ఇంటికి తరలించారు.