న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం కొత్త పోర్టల్ https://upsconline.nic.inను ప్రారంభించింది. అందరు దరఖాస్తుదారులు తాజాగా తమ దరఖాస్తులను నింపి, సంబంధిత డాక్యుమెంట్లను ఈ పోర్టల్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. గతంలో ఉండే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) మాడ్యూల్ ఇకపై వర్తించదు.
ఈ కొత్త పోర్టల్ వల్ల యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షలకు దరఖాస్తు చేయడంలో సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా, చిట్టచివరి క్షణంలో రద్దీని నివారించవచ్చు. దరఖాస్తుదారులు తమ గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును ఉపయోగించాలని యూపీఎస్సీ తెలిపింది. ఇది అన్ని పరీక్షలకు ఉమ్మడి రికార్డుగా ఉపయోగపడుతుందని పేర్కొంది. సీడీఎస్ ఎగ్జామ్-2, 2025; ఎన్డీఏ అండ్ ఎన్ఏ-2, 2025 కోసం దరఖాస్తులను ఈ కొత్త పోర్టల్ ద్వారానే పంపించాలని స్పష్టం చేసింది.
https://upsconline.nic.in పోర్టల్లో నాలుగు భాగాలు ఉన్నా యి. వీటిలో అకౌంట్ క్రియేషన్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్, కామన్ అప్లికేషన్ ఫాం అన్ని యూపీఎస్సీ పరీక్షలకు ఉపయోగపడతాయి.