తిరువనంతపురం: శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదని కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం, పొరుగు దేశానికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని, శ్రీలంకకు తగిన సహాయం చేస్తామని తెలిపారు.
“మేము శ్రీలంకకు మద్దతుగా ఉన్నాం. వారికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వారు వారి సమస్యలతో సతమతమవుతున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదు” అని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కేరళలో ఆదివారం ఆయన పర్యటించారు. శ్రీలంక సంక్షోభంపై స్పందించారు. పొరుగు దేశానికి ఎల్లప్పుడూ తాము సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.
శ్రీలకంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పదవినుంచి వైదొలగాలని నిరసిస్తూ శనివారం కొలంబోలో లక్షలాది మంది నిరసన తెలిపారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. రాజపక్సే ఇల్లు, కార్యాలయాలను ఆక్రమించారు. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కూడా తన పదవికి రాజీనామా చేశారు.