గుజరాత్ అహ్మాదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్సేఫ్టీపై శనివారం నాడు ఆయన ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.
విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ప్రమాదం జరిగిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్‌పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలో.. 650 అడుగుల ఎత్తులో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పైలట్ మేడే కాల్ చేశారని అన్నారు. విమాన సిబ్బందిని ఏటీసీ సంప్రదించినా స్పందన రాలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మంటలార్పి, మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని పేర్కొన్నారు. దుర్ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. అవసరమైతే ఈ కమిటీలో మరికొంతమందిని చేరుస్తామని ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం బ్లాక్‌బాక్స్ దొరికిందని తెలిపారు. బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేసిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు.
ఈ విమాన ప్రమాదం తనను ఎంతో షాక్‌కు గురిచేసిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసని చెప్పారు. రెండు రోజుల నుంచి ఎంతో బాధలో ఉన్నానని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లది ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదమని చెప్పారు. డీఎన్ఏ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయని.. మృతదేహాలను వీలైనంత తొందరగా అందజేస్తామని తెలిపారు.
ఈ ప్రమాదంపై హోం శాఖ సెక్రటరీ అధ్యక్షతన హైలెవల్ కమిటీతో దర్యాప్తు చేయిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రత్యేక అధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఈ కమిటీలో ఉన్నారని చెప్పారు. నిపుణుల దర్యాప్తు పూర్తయిన వెంటనే మీడియాకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. మూడు నెలల్లో ప్రమాదంపై కమిటీ నివేదిక అందజేస్తుందని భావిస్తున్నామని అన్నారు.
బోయింగ్ 787 సిరీస్ విమానాల భద్రతపై దర్యాప్తునకు ఆదేశించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం 34 బోయింగ్-787 విమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఏడు విమానాల భద్రతపై సమీక్ష జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఈ సిరీస్‌ను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు.