ముంబై: కేంద్ర మంత్రి కుమార్తెను ఒక జాతరలో కొంత మంది ఆకతాయిలు వేధించారు. (Union Minister’s Daughter Harassed) ఈ నేపథ్యంలో ఆ మంత్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రుల కుటుంబాలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహిళలకు రక్షణపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకురాలు రక్షా ఖడ్సే కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధించారు. మహా శివరాత్రి సందర్భంగా జల్గావ్లోని కోథలిలో నిర్వహించిన జాతరకు స్నేహితులతో కలిసి ఆమె వెళ్లింది. కొంతమంది యువకులు ఆ బాలికలను వేధించారు. వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. వారి ఫొటోలు, వీడియోలు తీశారు. సెక్యూరిటీ గార్డు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడితో ఘర్షణ పడ్డారు.
కాగా, కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. తన కుమార్తెను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెను వేధించడంపై కలత చెందినట్లు తెలిపారు. ‘నేను కేంద్ర మంత్రిగా, ఎంపీగా కాకుండా న్యాయం కోరుతూ తల్లిగా వచ్చాను’ అని అన్నారు. సెక్యూరిటీ ఉన్న ఒక ప్రజా ప్రతినిధి కుమార్తె వేధింపులకు గురైతే, సాధారణ పౌరుల భద్రత ఏమిటని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు మహారాష్ట్ర అంతటా మహిళలపై నేరాలు పెరిగాయని, చట్టాల పట్ల భయం లేకుండా పోయిందని మూడు సార్లు ఎంపీగా గెలిచిన రక్షా ఖడ్సే ఆరోపించారు. చాలా మంది అమ్మాయిలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడానికి వెనుకాడతారని తెలిపారు. అయితే మౌనంగా ఉండకూడదని చెప్పారు. సీఎం ఫడ్నవీస్‌ను తాను కలుస్తానని, ఇలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తానని ఆమె అన్నారు.
కాగా, కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే మైనర్ కుమార్తెను వేధించిన ఏడుగురు నిందితులను గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సంఘటనపై స్పందించారు. నిందితులను వదిలిపెట్టబోమని అన్నారు. అయితే ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే చంద్రకాంత్ పాటిల్‌తో నిందితులకు సంబంధం ఉన్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి.