Advance Tip | న్యూఢిల్లీ: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్ హెయిలింగ్ కంపెనీల యాప్‌లపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) దర్యాప్తు చేస్తున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. సత్వర సేవల కోసం ముందుగానే టిప్‌ను చెల్లించాలని కస్టమర్లను బలవంతపెట్టడం లేదా సుతిమెత్తగా కోరడం అనైతికమని, దోపిడీతో కూడుకున్నదని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు అనుచిత వ్యాపార పద్ధతుల కిందికి వస్తాయన్నారు. టిప్ అంటే ప్రశంసాపూర్వకంగా ఇచ్చేదని, సేవకు ముందస్తు షరతు కాదని తెలిపారు.
డ్రైవర్లకు ముందుగానే టిప్ ఇస్తే, రైడ్‌ను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఉబర్ చెప్తున్నది. ర్యాపిడో, ఓలా క్యాబ్స్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. వేగంగా రైడ్ దొరకాలంటే అదనంగా చెల్లించాలని యూజర్లకు చెప్తున్నాయి.
కర్ణాటక ప్రభుత్వ రంగంలోని నమ్మ యాత్రి యాప్ 2022లో ఈ విధానాన్ని ప్రారంభించింది. దీనిని ర్యాపిడో 2023లో అనుసరించింది. ఉబర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలుపెట్టింది. నమ్మ యాత్రి యాప్‌లో ‘టిప్‌ను కలపండి’ అని చెప్పడానికి బదులుగా, ‘మరింత కలపండి (స్వచ్ఛందం)’ అని పేర్కొంది. అంటే, అడ్వాన్స్ టిప్పింగ్ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుందని, స్వచ్ఛందంగా ఇస్తే ఇవ్వవచ్చునని అర్థం వచ్చేలా యాప్‌ను రూపొందించింది. కానీ వాస్తవంగా క్యాబ్‌లను అప్పటికప్పుడు బుక్ చేసుకోవలసి ఉంటుంది కాబట్టి, అడ్వాన్స్ టిప్పింగ్ స్వచ్ఛందం కాబోదు. ఎందుకంటే, ‘నేను ఇవ్వకపోతే, మరొకరు ఇచ్చేసి, క్యాబ్‌ను బుక్ చేసేసుకుంటారు’ అనే భయం కస్టమర్లకు ఉంటుంది.
కస్టమర్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అడ్వాన్స్ టిప్ కుంభకోణం నమ్మ యాత్రి నుంచి మొదలైందని, ఈ వైరస్ ఉబర్, ర్యాపిడోలకు పాకిందని మండిపడుతున్నారు. మెరుగైన సేవల ముసుగులో ముందుగానే అదనంగా చెల్లించాలని కోరడం పట్టపగలు చేసే దోపిడీ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్ రావడానికి పూర్వం రైడ్ బుకింగ్ సునాయాసంగా జరిగేదని, ర్యాపిడో, ఉబర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టిప్ నిజంగానే డ్రైవర్లకు వెళ్తున్నదా? కంపెనీ కొంత వాటా కొట్టేస్తున్నదా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.