Nitin Gadkari | నాగ్‌పూర్: తరచూ చమత్కారంగా మాట్లాడే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, రాదో చెప్పలేం కానీ, రామ్‌దాస్ అథవాలే మాత్రం మరోసారి మంత్రి పదవి చేపడతారనే గ్యారంటీ కచ్చితంగా ఉంది” అన్నారు. కేంద్ర మంత్రి అథవాలేతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఇందుకు చిరునవ్వులు చిందించారు.
అనంతరం గడ్కరీ మాట్లాడుతూ, “జస్ట్ జోక్ చేస్తున్నా” అన్నారు. అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇం డియా (ఏ) కూడా ఎన్డీయేలో భాగస్వామి. ఆయన వరుసగా మూడుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోసారి గెలిస్తే, మంత్రి పదవిని చేపట్టే పరంపరను కొనసాగిస్తానని చెప్పారు. మహారాష్ట్రలోని అధికార కూటమిలో కూడా ఆర్పీఐ (ఏ) భాగస్వామి. 288 స్థానాలున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు త్వరలో జరుగుతాయి. రాష్ట్రంలో మహాయుతిలో భాగమైన తమ పార్టీకి 10-12 స్థానాలను ఇవ్వాలని అథవాలే అన్నారు.