న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ఏడు రోజుల పాటు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత ఉచిత వైద్యాన్ని అందించనున్నట్టు చెప్పారు. ప్రమాద సమాచారాన్ని 24 గంటల్లో పోలీసులకు అందిస్తే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని మార్చి నుంచి దేశమంతా విస్తరించనున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఇప్పుడు ఇస్తున్న రూ.5000 సాయాన్ని పెంచనున్నట్టు చెప్పారు. బుధవారం అన్ని రాష్ర్టాల రవాణా శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ట్రక్కుల వల్ల 2022లో జరిగిన ప్రమాదాల్లో 33 వేల మంది మరణించినట్టు చెప్పారు.
డ్రైవర్లు నిద్రలోకి జారుకున్నప్పుడు అప్రమత్తం చేసే ఆడియో వార్నింగ్ వ్యవస్థను కొత్త బస్సులు, ట్రక్కుల్లో తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు. స్ట్రీరింగ్‌ను అతిగా లేదా తక్కువ తిప్పినప్పుడు యాక్టివేట్ అయ్యే ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ను సైతం తీసుకురానున్నట్టు వివరించారు. వాణిజ్య వాహనాలపై డ్రైవర్లు రోజులో ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకుండా నియంత్రించేందుకు ఆధార్ ఆధారిత సాంకేతిక వ్యవస్థను తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. దేశంలో నిపుణులైన డ్రైవర్ల కొరత ఉందని, డ్రైవర్ల కొరత తీర్చేందుకు 1,250 కొత్త డ్రైవింగ్ స్కూళ్లను తెరవనున్నట్టు చెప్పారు.