మైసూరు: కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు 60 శాతానికి పెరిగాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఆదివారం మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం దీన్ని ఒప్పుకున్నారని, పేదలకు చెందిన ఇళ్ల కేటాయింపులో కూడా అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.
గతంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) లంచాలు వసూలు చేసేవారని, కాని ఇప్పుడు సచివాలయంలో మంత్రులే నేరుగా ముడుపులు తీసుకుంటున్నారని కుమారస్వామి ఆరోపించారు. దీన్నేనా సత్యమేవ జయతే అంటారు అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును లూటీ చేయడంలో మీ ఆశకు అంతులేదా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.