న్యూఢిల్లీ, జూన్ 7: ఉత్తరాది-దక్షిణాది విభజనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రాంతీయం పేరుతో దేశాన్ని విభజించ వద్దని, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ భారతీయులేనని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ర్టాల రాజకీయ ప్రయోజనాలను విస్మరించిన బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఉత్తరాదికి ప్రాధాన్యం ఇస్తున్నదంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.
‘ప్రధాని ఉత్తరాదికి చెందిన వారు. రాష్ట్రపతి కూడా ఉత్తరాది వారే. ఇందుకు కారణం మాకు ప్రాతినిధ్యం వహించే శక్తి మీకు (బీజేపీకి) లేకపోవడమే’ అని బెంగళూరులో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ర్టాల అభివృద్ధికి తమ పన్నుల సొమ్ము వినియోగిస్తున్నారని, అయినప్పటికీ దక్షిణాది వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవించాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై రిజిజు స్పందించారు. రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులు వరుసగా తూర్పు, పశ్చిమ, దక్షిణ భారత్‌కు చెందిన వారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రపతి తూర్పు ప్రాంతంలో ఉన్న ఒడిశాలోని వినయశీలి, అంకిత భావం గల గిరిజనురాలని, ప్రధాని మోదీ పశ్చిమ ప్రాంతంలోని గుజరాత్‌కు చెందిన దార్శనిక నేత అని, అలాగే ఉప రాష్ట్రపతి దక్షిణాదిలోని తమిళనాడుకు చెందిన వారని ఆయన వివరించారు.