న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన యువతి శ్రద్ధా హత్యపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచినట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతలు మండిపడ్డారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సహజీవనం చేస్తున్న శ్రద్ధను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ దారుణంగా హత్య చేయడం, అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలో పలు చోట్ల పడేయడాన్ని దర్యాప్తులో పోలీసులు గుర్తించడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. శ్రద్ధ హత్యపై స్పందించాలని యాంకర్ కోరగా ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధ హత్యకు స్వయంగా ఆమెనే కారణమని ఆరోపించారు. తల్లిదండ్రులను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేసే చదువుకున్న యువతులను నిందించాల్సి ఉంటుందన్నారు. ‘ఈ సంఘటనకు (శ్రద్ధ హత్యకు) పూర్తి బాధ్యత ఆమెదే. సహజీవనానికి ఆమె తల్లి, తండ్రి వ్యతిరేకించారు. చదువుకున్న అమ్మాయి ఈ నిర్ణయం తీసుకుంది. సహజీవనం చేయడం ఆమె పొరపాటు. మీరు నిజంగా ఎవరితోనైనా ప్రేమలో పడితే ముందుగా పెళ్లి చేసుకోండి. ఈ లివ్-ఇన్ రిలేషన్లు ఏమిటి? ఇలాంటి పద్ధతులు నేరాలను ప్రోత్సహిస్తాయి’ అని అన్నారు.
కాగా, కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. ‘సిగ్గులేని, హృదయం లేని క్రూరమైన వ్యాఖ్యలు. అన్ని సమస్యలకు స్త్రీని నిందించే మనస్తత్వం’ అని విమర్శించారు. ప్రధాని మోదీ నిజంగానే మహిళా శక్తి గురించి మాట్లాడి ఉంటే ఈ వ్యాఖ్యలు చేసిన కౌశల్ కిషోర్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
If @PMOIndia really means what he says about women Shakti then he must sack this Union Minister immediately. We the women have had enough of carrying the burden of such patriarchal rubbish in the society.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 17, 2022