గయా, ఏప్రిల్ 9: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలిని ఆమె భర్త కాల్చి చంపిన దారుణ ఘటన బీహార్‌లోని గయాలో బుధవారం చోటుచేసుకుంది. టెటువా గ్రామంలోని తన ఇంట్లో బాధితురాలు సుష్మా దేవి, ఆమె పిల్లలు, సోదరి పూనమ్ కుమారి ఉండగా ఈ ఘటన జరిగింది. తన మనవరాలి హత్యపై గయా ఎంపీ కూడా అయిన మాంఝీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మృతురాలి సోదరి పూనమ్ కథనం ప్రకారం.. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం12 గంటలకు సుష్మాకు, ఆమె భర్త రమేశ్‌కు తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో రమేశ్ నాటు తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తర్వాత రమేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. సుష్మా ‘వికాస్ మిత్ర’గా పనిచేస్తుండగా, ఆమె భర్త రమేశ్ ట్రక్కు డ్రైవర్‌గా ఉన్నాడు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ 14 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. తన సోదరిని చంపిన రమేశ్‌ను ఉరితీయాలని పూనమ్ డిమాండ్ చేశారు.