త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించే ఆలోచన కేంద్రానికి లేదు. లోక్సభకు ముందస్తు ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల వాయిదా అనేది మీడియా ఊహాగానాలు మాత్రమే.
-కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: జమిలి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశమే లేదని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ తన పదవీకాలం ముగిసే చివరిరోజు వరకూ సేవలందిస్తారని స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. లోక్సభకు ముందస్తు ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల వాయిదా అనేది మీడియా ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై ప్రభుత్వం కమిటీ వేసిందని, విస్తృత సంప్రదింపుల తర్వాత కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని వెల్లడించారు. సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్న కేంద్ర మంత్రి ఠాకూర్.. ఆ సమావేశ ఎజెండాను మాత్రం వెల్లడించలేదు.