Karpuri Tagore | బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారత రత్న అవార్డు ప్రకటించింది. ఆయనకు జన నాయక్ అనే పేరు కూడా ఉండేది. ఆయన శత జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న అవార్డు ప్రకటించారు. ఆయనకు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అవార్డు ప్రకటించడం ఆసక్తికర పరిణామం. ఆయన సోషలిస్టు పార్టీ, భారతీయ క్రాంతి దళ్ పార్టీల తరఫున 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకూ బీహార్ సీఎంగా పని చేశారు. తిరిగి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకూ సీఎంగా ఉన్నారు. 1988 ఫిబ్రవరి 17న మరణించారు.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా కర్పూరి గ్రామం (పితాంజుహియా)లో 1924 జనవరి 24న గోకుల్ ఠాకూర్, రాందులారి దేవి దంపతులకు జన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడు అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో పని చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం క్విట్ ఇండియా ఉద్యమంలో పని చేసి 26 నెలల పాటు జైలు పాలయ్యారు కూడా. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.