Chandrayaan-4 | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి, ప్రదర్శన కోసం చేపట్టనున్న ‘చంద్రయాన్-4’ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,104.06 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడం కోసం దాని కక్ష్యలోకి వ్యోమనౌకను పంపించేందుకు చేపట్టనున్న ‘వీనస్ ఆర్బటర్ మిషన్'(శుక్రయాన్-1)కు రూ.1,236 కోట్లు కేటాయించింది. పాక్షిక పునర్వినియోగానికి అవకాశం ఉండే నెక్ట్స్ జెనెరేషన్ లాంచ్ వెహికిల్(ఎన్జీఎల్వీ)కి సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా కీలకమైన ఎన్జీఎల్వీతో పాటు మూడు డెవలప్మెంటల్ విమానాలు, ఇతర అవసరమైన సాంకేతికత అభివృద్ధి కోసం రూ.8,240 కోట్లు కేటాయించింది.
గిరిజనుల కోసం కొత్త పథకం
దేశవ్యాప్తంగా గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు గానూ రూ.79,156 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ(ఏవీజీసీ-ఎక్స్ఆర్) కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్(ఎన్సీఓఈ)ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. 2024-25 రబీ సీజన్‌కు ఫాస్ఫాటిక్, పొటాస్సిక్(పీ ఆండ్ కే) ఎరువుల సబ్సిడీగా రూ.24,474.53 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. రైతుల పంటలకు మెరుగైన ధరలు అందేలా చూసేందుకు, నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉంచేందుకు రూ.35,000 కోట్ల వ్యయంతో పీఎం-ఆశా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. జీవసాంకేతిక విజ్ఞానంలో అధునాతన పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.9,197 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ రిసెర్చ్ ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ డెవెలప్మెంట్(బయో-రైడ్) పథకాన్ని ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
చంద్రయాన్-4 లక్ష్యమేంటి?
చంద్రయాన్-3 విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో 2040 నాటికి చంద్రుడి పైకి భారతీయ వ్యోమగాములను పంపి, సురక్షితంగా తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అవసరమైన సాంకేతికతలను దేశీయంగానే అభివృద్ధి చేసి, ప్రదర్శించడమే చంద్రయాన్-4 మిషన్ లక్ష్యం. 36 నెలల కాలంలో ఈ మిషన్‌ను పూర్తి చేయాలని ఇస్రో భావిస్తున్నది. ఇందులో భాగంగా ఇస్రో స్వయంగా వ్యోమనౌకను అభివృద్ధి చేసి, ప్రయోగించనున్నది. ఇప్పటికే చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవగలిగే సాంకేతికతను ప్రదర్శించామని, చంద్రయాన్-4 ద్వారా వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకురావడం కీలక లక్ష్యమని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు.
శుక్రగ్రహ అన్వేషణకు శుక్రయాన్-1
భూమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన శుక్రుడిపై అన్వేషణ కోసం ఇస్రో శుక్రయాన్-1(వీనస్ ఆర్బిటర్ మిషన్) చేపట్టనుంది. శుక్రగ్రహం సైతం భూమి లాగానే ఏర్పడిందని భావిస్తున్న శాస్త్రవేత్తలకు, ఈ గ్రహంపై భూమికి భిన్నంగా 450 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో వ్యోమనౌకను శుక్రగ్రహ కక్ష్యలోకి పంపించి, ఈ గ్రహం ఉపరితలం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయడమే శుక్రయాన్-1 లక్ష్యం. 2028 మార్చిలో ఈ ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావిస్తున్నది.