Union Budget | వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలుఉట్టిపడేలా ప్రత్యేకంగా కాంజీవరం పట్టు చీరను ధరించి వచ్చిన ఆమె.. 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. కాగా, స్వతంత్ర భారత చరిత్రలో ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించడం ఇదే తొలిసారి.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పవిత్ర మాఘపౌర్ణిమ రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోందని చెప్పారు. యువశక్తి కేంద్రంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రైతులు, దళిత, గిరిజన సమూహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని ఆకాంక్షించారు. కర్తవ్య భవన్లో రూపొందించిన మూడో బడ్జెట్ ఇది అని తెలిపారు. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామని అన్నారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆధారిత బడ్జెట్ ఇది అని నిర్మలా సీతారామన్ తెలిపారు. అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామని అన్నారు. 2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉందని అన్నారు. ఆర్థిక సుస్థిరత కోసం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు తెచ్చామని అన్నారు. చాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వెల్లించారు. రూ.10 వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తున్నామని అన్నారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలను తీసుకొస్తున్నామని చెప్పారు.