ఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో అణు విద్యుత్తు సామర్థ్యం పెంచే దిశగా కేంద్రప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తాజా బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ మిషన్‌కు రూ.20 వేల కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా అవసరమైతే చట్టాల సవరణకు రెడీ అంటున్నది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ అణు విద్యుత్తు సామర్థ్యం 100 గిగావాట్లకు పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అణుశక్తి మిషన్ కింద రూ.20 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ ఎస్ఎంఆర్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.
ప్రాంతీయ కనెక్టివిటీని ప్రోత్సహించేందుకు కేంద్రం మార్పులతో కూడిన కొత్త ఉడాన్ పథకాన్ని శనివారం ప్రకటించింది. రానున్న పదేండ్లలో 120 కొత్త గమ్యస్థానాలకు ఈ పథకం కింద కనెక్టివిటీ కల్పించనున్నారు. తద్వారా 4 కోట్ల మందికి విమాన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది.
దేశంలో తొలిసారిగా 5 లక్షల మంది, ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరేలా కేంద్రం రెండు కోట్ల టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే క్రెడిట్ గ్యారెంటీని రెట్టింపు చేసి రూ.20 కోట్లకు పెంచామని చెప్పారు.
నగరాలలో అసంపూర్తిగా నిలిచిపోయిన 1 లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు స్వామిహ్ నిధికి రూ. 15,000 కోట్లు కేటాయించారు.
‘మహిళ, శిశు అభివృద్ధి’ శాఖకు ఈసారి రూ.26,889 కోట్లను కేంద్రం కేటాయించింది. 8 కోట్లకు పైగా పిల్లలు, కోటి మంది గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, 20 లక్షల మంది బాలికలకు పోషకాహార మద్దతు పెంచుతున్నట్టు చెప్పారు. ‘మిషన్ శక్తి’కి రూ.3,150 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు.
ఈసారి బడ్జెట్లో కేంద్రప్రభుత్వం మాల్దీవులకు రూ.600 కోట్లు కేటాయించింది. అలాగే భూటాన్‌కు అత్యధికంగా రూ.2,150 కోట్లు, నేపాల్‌కు రూ.700 కోట్లు, మారిషస్‌కు రూ.500 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. ‘మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్’ పేరిట రూ.25,000 కోట్లతో కార్పస్ సమకూరుస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక శాఖకు రూ.2,541.06 కోట్లు కేటాయించారు.