ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, ఆస్తుల నగదీకరణతో రూ.50 వేల కోట్లు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మరోవైపు, ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్ చెల్లింపులు రూ.56,260 కోట్ల స్థాయిలో ఉంటుందని బడ్జెట్ అంచనావేస్తున్నది. వీటితోపాటు ఆర్బీఐ, బ్యాంకులు, ఆర్థిక సేవల ఇనిస్టిట్యూషన్ల నుంచి రూ.2,32,874 కోట్ల డివిడెండ్ రూపంలో చెల్లించవచ్చునని తెలిపింది. మధ్యంతర బడ్జెట్లో అంచనావేసిన రూ.1.02 లక్షల కోట్ల కంటే ఇది రెండింతలు అధికం.
ఎఫ్‌డీఐ రూల్స్ సరళతరం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడానికి ఎఫ్‌డీఐ మార్గదర్శకాలను మరింత సరళతరం చేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు విదేశీ పెట్టుబడులకోసం దేశీయ కరెన్సీని వినియోగించనున్నట్లు ప్రకటించారు.
లిటికేషన్ కోసం వివాద్ సే విశ్వాస్
లిటికేషన్ కాలపరిమితిని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ వివాద్ సే విశ్వాస్ స్కీం 2.0 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫైలింగ్‌కు సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఈ స్కీంతో రీ-అసెస్మెంట్ ప్రాసిడింగ్స్ చేసుకోవడానికి వీలుపడనున్నది. ఆదాయం రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, దీనికి సంబంధించి అసెస్మెంట్ ఏడాది ముగిసినప్పటి నుంచి గరిష్ఠంగా ఐదేండ్ల వరకు ఉన్న లిటికేషన్ కేసులను ఈ స్కీం ద్వారా పరిష్కరించనున్నారు.