(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం దేశ యువతకు ధోకా ఇచ్చింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇచ్చిన హామీని పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వశాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ ప్రక్రియను మాత్రం మరిచారు. దీంతో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోయింది. మరోవైపు, ఎన్డీయే సర్కారు విధానపరమైన వైఫల్యాలతో పెట్టుబడులు అంతకంతకూ పడిపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో లక్షల కంపెనీలు మూతబడ్డాయి. దీంతో అంతిమంగా యువతకు అటు ప్రభుత్వ శాఖల్లో, ఇటు ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ కంటే మన దగ్గరే నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నదంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెచ్చరిల్లిందో అర్థం చేసుకోవచ్చు.
2014 ఎన్నికల ముందు మోదీ హామీని ఇస్తూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ లెక్కన గడిచిన 11 సంవత్సరాల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు మాత్రం 7 లక్షలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రప్రభుత్వ శాఖల్లో 10 లక్షల మేర కొలువులు ఖాళీగా ఉన్నట్టు 2023లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఒప్పుకొన్నది. ఇప్పుడు ఆ సంఖ్య 12 లక్షలకు చేరినట్టు నివేదికలు చెప్తున్నాయి. అయినప్పటికీ.. వాటి భర్తీని ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో గడిచిన 11 ఏండ్లలో 12 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీలు మూతబడ్డట్టు నివేదికలు చెప్తున్నాయి. అంటే రోజుకు సగటున 300 కంపెనీలు షట్డౌన్ అయినట్టు అర్థం. దీంతో ప్రైవేటు కంపెనీల్లో కూడా యువతకు ఉద్యోగాలు లభించని దుస్థితి వాటిల్లింది. దేశంలో నిరుద్యోగిత రేటు 7.2 శాతంగా ఉన్నట్టు మేధోసంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తన తాజా సూచీలో వెల్లడించింది. నిరుడు నమోదైన సగటు నిరుద్యోగిత రేటు 4.9 శాతంతో పోలిస్తే, ఇది 2.3 శాతం ఎక్కువగా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమే ఉన్నారని హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 50 శాతానికి పైగా పట్టభద్రులు తమ డిగ్రీని పక్కనబెట్టి.. క్లర్క్, మెషీన్ ఆపరేటర్ వంటి ఏడో తరగతి స్థాయి ఉద్యోగాలను చేస్తున్నట్టు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) మరో నివేదికలో వెల్లడించింది. ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన 83 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభించలేదని స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ ‘అన్స్టాప్’ ఇటీవల విడుదల చేసిన టాలెంట్ రిపోర్ట్-2025లో వెల్లడైంది.
మోదీ ప్రభుత్వం ఏటా ఇస్తామన్న ఉద్యోగాలు 2 కోట్లు
11 ఏండ్లలో యువతకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు 22 కోట్లు
11 ఏండ్లలో ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన కొలువులు 7 లక్షలు
ఇంజినీరింగ్ పూర్తైనా జాబ్ దొరకనివారు 83 శాతం
డిగ్రీ పట్టాకు తగిన ఉద్యోగం చేయని వారు 91.75 శాతం
డిగ్రీ ఉన్నప్పటికీ క్లర్క్ జాబ్స్ చేస్తున్నవారు 50 శాతం
బిజినెస్ గ్రాడ్యుయేట్లలో జాబ్ లేనివారు 46 శాతం