బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో సమర శంఖం పూరించారు. వేలాదిమంది నిరసనకారుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మార్మోగిపోయింది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలన్న డిమాండుతోపాటు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకోనున్న ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాపంచాయత్‌లో వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది రైతులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 25: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, నిరుద్యోగులు దేశ రాజధానిలో సమర శంఖం పూరించారు. వేలాదిమంది నిరసనకారుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మార్మోగిపోయింది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలన్న డిమాండుతోపాటు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకోనున్న ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో జరుగుతున్న మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు అనేక రాష్ర్టాలకు చెందిన వేలాదిమంది రైతులు జంతర్ మంతర్ చేరుకోగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ దేశ నలుమూలలకు చెందిన వేలాదిమంది నిరుద్యోగ యువజనులు రాంలీలా మైదానంలో ఆందోళన చేపట్టారు.
మహా పంచాయత్‌లో పాల్గొనేందుకు వేలాది మంది రైతులు సోమవారం ఉదయం జంతర్ మంతర్ చేరుకున్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను చట్టబద్ధం చేయాలన్న తమ దీర్ఘకాల డిమాండుతోపాటు, అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, మత్స్య రంగాలను మినహాయించాలని, గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ కాలంలో రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలన్న డిమాండ్లపై చర్చించేందుకు మహాపంచాయత్ జరుగుతోంది.
తమ డిమాండ్లకు ఎస్ఎస్సీ ఇప్పటివరకు స్పందించలేదని రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలకు చెందిన రాము గోస్వామి అనే నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్ర 7 గంటల తర్వాత భారీ స్థాయిలో పోలీసు బలగాలు రాంలీలా మైదానంలో మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఎస్సీ పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని, అభ్యర్థుల నివాసాల నుంచి 400-500 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలు కేటాయించారని, ఆన్సర్ కీలో తప్పులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలలో సాంకేతిక సమస్యలు తలెత్తడం, నాసిరకం మౌలిక సదుపాయాలు, పదేపదే సర్వర్ ఫెయిల్యూర్లు జరగడం వంటివి చోటుచేసుకున్నట్లు ఆశావహులు ఆరోపిస్తున్నారు. పరీక్షలు తమ భవిష్యత్తని, వ్యవస్థ దాన్ని నాశనం చేస్తోందని రైల్వే రిక్రూట్మెంట్ కోసం తయారవుతున్న అలీగఢ్‌కు చెందిన ఓ విద్యార్థి వాపోయాడు. సంస్కరణలు చేపడతామని ఎస్ఎస్సీ చైర్మన్ ఇచ్చిన హామీ అమలు కాలేదని వారు ఆరోపించారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్తోసహా అనేక రాష్ర్టాలకు చెందిన ఆశావహులు నిరసనలో పాల్గొన్నారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నిరసన తెలిపేందుకు దేశ నలుమూలల నుంచి వేలాదిమంది ఆశావహులు రాంలీలా మైదానం చేరుకున్నారు. వ్యవస్థాపరమైన సంస్కరణలు చేపట్టాలని డిమాండు చేస్తూ వారంతా ఆదివారం నాడే ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకే నిరసన నిర్వహించడానికి అనుమతి ఉందని, అనంతరం వెళ్లిపోవాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించినప్పటికీ అక్కడి నుంచి కదలడానికి నిరుద్యోగులు నిరాకరించారు. అనుమతించిన సమయం తర్వాత అక్కడే ఉండడం చట్ట వ్యతిరేకమవుతుందని ఏసీపీ ప్రకటించినప్పటికీ వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన తాము ఇప్పుడు ఎక్కడకు వెళ్లగలమని వారు అధికారులను నిలదీశారు.