బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) చాలా ఇరకాటంలో పడ్డారు. స్కామ్ ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవాలని సొంత పార్టీ నేతలు కూడా సూచిస్తున్నారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి ఆయన తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు.
కాగా, రాష్ట్రంలోని అధికార పార్టీకి మరింత ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవాలని ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన 79 ఏళ్ల కేబీ కోలివాడ్ సూచించారు. ‘ఈ మచ్చ తొలగిపోయిన తర్వాత ఆయన మళ్లీ సీఎం కావచ్చు. ఇది నా వ్యక్తిగత అభ్యర్థన’ అని మీడియాతో అన్నారు. ఈ పరిస్థితిని ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీకి అధ్యక్షుడైన కేబీ కోలివాడ్ విమర్శించారు. ప్రధాని మోదీ కూడా హర్యానాలో దీని గురించి మాట్లాడటాన్ని ఆయన గుర్తు చేశారు.