పాట్నా: తన కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లేందుకు ఒక వ్యక్తి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల రైలు ఎక్కలేకపోయాడు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల డబ్బు వాపస్ కోసం డిమాండ్ చేశాడు. గడువులోగా వడ్డీతో చెల్లించని పక్షంలో 50 లక్షల పరిహారం ఇవ్వాలని రైల్వేకు నోటీస్ పంపాడు. (Man Seeks Rs 50 Lakh Compensation) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్నది.
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా గైఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన జనక్ కిషోర్ ఝా అలియాస్ రాజన్ తన కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీని కోసం ఏసీ 3 కోచ్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. జనవరి 26న స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే ఏసీ కోచ్ డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉంది. దీంతో రైల్వే సిబ్బంది సహాయాన్ని కోరాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కుంభమేళాకు వెళ్లేందుకు ఆ రైలు ఎక్కలేకపోయారు.
కాగా, రైల్వే నిర్లక్ష్యం కారణంగా 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు తాను, తన కుటుంబం వెళ్లలేకపోవడంపై కిషోర్ ఝా ఆవేదన వ్యక్తం చేశాడు. మతపరంగా ప్రాముఖ్యత కలిగిన మహా కుంభమేళాకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోవడం ఆర్థికంగానే కాక మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా బాధ కలిగిందని వాపోయాడు.
ఈ నేపథ్యంలో టిక్కెట్ల మొత్తాన్ని 15 రోజుల్లోపు వడ్డీతో సహా చెల్లించాలని రైల్వేను కిషోర్ ఝా కోరాడు. లేనిపక్షంలో రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. న్యాయవాది ద్వారా రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు ఈ మేరకు నోటీస్ పంపాడు. రైల్వే స్పందించకపోతే వినియోగదారుల రక్షణ చట్టం కింద సేవా లోపం ఆరోపణలపై సంబంధిత కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తరుఫు న్యాయవాది హెచ్చరించారు.