న్యూఢిల్లీ : భారీ మంచుముక్క విరిగి కింద ఉన్న నదీలోయలో పడిపోవడం వల్ల ఇటీవల నేపాల్‌లో జల విలయం సంభవించింది. వెయ్యి మందికి పైగా చనిపోగా నాలుగు వేల మందికి పైగా గల్లంతయ్యారు. ఒక్క మంచుముక్క విరిగిపడితేనే ఈ స్థాయిలో నష్టం జరిగితే.. ఇక హిమాలయాల్లో 25 శాతం మంచు కరిగిపోతే.. ఆ ప్రళయాన్ని ఊహించడం కూడా కష్టమే. ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా ప్రపంచ ఉష్ణోగ్రతలను అదుపు చేయలేకపోతే మరో 75 ఏండ్ల తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం కనిపిస్తున్నది. 2100 సంవత్సరం నాటికి హిమానీనదాలు తమ ద్రవ్యరాశిలో 25% కంటే ఎక్కువ కోల్పోవచ్చని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొన్నది. ప్రపంచ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామిక పూర్వపు స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యాన్ని దాటిపోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉన్నదని ఐరాస ధ్రువీకరించింది.
అన్ని జాతీయ వాతావరణ ప్రతిజ్ఞలు, నెట్-జీరో లక్ష్యాలను పూర్తిగా అమలు చేసినప్పటికీ ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వపు స్థాయి కంటే 1.8 డిగ్రీలు పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా. హిమానీనదాలు కరుగడం వల్ల సముద్రమట్టాలు 9 నుంచి 12.5 సెం.మీ. వరకు పెరుగుతాయి. నేపాల్, టిబెట్‌లో హిమనీనదాలు కూలిపోవడంతో సంభవించిన వినాశకరమైన జలవిలయం తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది. చమురు, గ్యాస్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల నుంచి వెలువడే గ్రీన్హౌస్ ఉద్గారాల కారణంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఇప్పటికే 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని ఐరాస నివేదిక ఎత్తిచూపింది. ‘ఈ వేసవిలో సంభవించిన తీవ్రమైన వేడి, వ్యాపిస్తున్న కార్చిచ్చులు, ప్రాణాంతకమైన వరదలు భవిష్యత్తులో రాబోయే పరిణామాలకు హెచ్చరిక. 1.5 డిగ్రీల కంటే ఎక్కువ వేడి పెరుగకుండా ఉండేలా చూసుకోవాలి’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు.